కేరాఫ్ కంచరపాలెం 2018లో వెంకటేష్ మహా దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. విశాఖపట్నానికి చెందిన కంచరపాలెం అనే ప్రాంతంలో స్థానికులను ప్రధాన పాత్రధారులుగా ఎంపిక చేసి రూపొందించిన చిత్రం ఇది.[1]
ఇందులో నాలుగు కథలు ఉంటాయి. ప్రభుత్వ ఆఫీసులో పనిచేసే అటెండర్ రాజు (సుబ్బారావు) 49 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోకుండా ఉంటాడు. ఆయనకు అదే ఆఫీసులో మేనేజరుగా పనిచేసే రాధ (రాధ బెస్సీ) అనే వితంతువుతో పరిచయమవుతుంది. అదే పరిచయం స్నేహంగా మారుతుంది. ఒకానొక సందర్భంలో తనకు మళ్లీ వివాహం చేసుకోవాలని ఉందని రాజుతో చెప్పిన రాధ.. తనను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా... అని రాజును అడుగుతుంది. ముందు తటపటాయించినా తర్వాత ఒప్పుకుంటాడు రాజు. అయితే రాధ సోదరుడు ఆ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వారి కథ సందిగ్ధంలో పడుతుంది. అలాగే జోసెఫ్ (కార్తిక్ రత్నం) అనే క్రైస్తవ యువకుడు, భార్గవి (ప్రణీత పట్నాయక్) అనే బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆమె తొలుత పెళ్లి చేసుకుంటానని చెప్పినా ఆ తర్వాత ఇంట్లో తండ్రి బెదిరింపులకు తలొగ్గి వేరే వివాహం చేసుకోవడంతో ఆ ప్రేమ కథ కూడా విషాదభరితంగా ముగుస్తుంది.
అదేవిధంగా గెడ్డం (మోహన్ భగత్) అనే పేరు గల కుర్రాడు బార్లో పనిచేస్తూ ఉంటాడు. తన షాపుకొచ్చి మందు బాటిల్ కొనుక్కొని వెళ్లే సలీమా (ప్రవీణా మురళి)తో ప్రేమలో పడతాడు. అయితే ఆమె వేశ్య అని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు. అయినా సరే ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే ఆమె అర్థాంతరంగా మరణించడంతో కుంగిపోతాడు ఆ యువకుడు. ఈ కథలన్నింటి మధ్యా ఓ చిన్నపిల్లల కథ కూడా సమాంతరంగా నడుస్తుంది. వినాయకుడి బొమ్మలు తయారుచేసి అమ్మే రామ్మూర్తి (కిషోర్ పొలిమేర) కొడుకు సుందరానికి (కేశవ్ కర్రి) తనతో పాటు చదువుకొనే సునీత (నిత్యశ్రీ) అంటే చాలా ఇష్టం. పాటలు బాగా పాడే సునీత తన తండ్రికి పాటలంటే ఇష్టం లేకపోవడంతో ఆ ఆశను వదిలేసుకుంటుంది. కానీ సుందరం ఇచ్చిన ప్రేరణతో స్కూల్లో పాడుతుంది. అది చూసిన ఆమె తండ్రి సునీతను స్కూలు మానిపించేసి ఢిల్లీకి పంపించేస్తాడు. తన స్నేహితురాలు దూరమవడంతో సుందరం చాలా బాధపడతాడు. తన స్నేహితురాలు దూరం కావడానికి కారణం దేవుడేనని భావించిన సుందరం తన తండ్రి తయారుచేసిన పెద్ద వినాయకుడి విగ్రహాన్ని రాళ్లతో కొట్టి అంధవికారంగా మారుస్తాడు. తను ఎంతో కష్టపడి చేసిన బొమ్మ పాడవ్వడంతో దళారుల మాటలు పడలేక సుందరం తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు. సినిమాలో ఈ నాలుగు కథలు సమాంతరంగా జరిగినా ఆ నాలుగు కథలకు ఒక చిత్రమైన సంబంధం ఉంటుంది. ఆ సంబంధమేమిటో సినిమా చివరలో చూపిస్తాడు దర్శకుడు.[2][3]
అపోలో హెల్త్ స్ట్రీట్ సంస్థలో కొన్నాళ్లు పనిచేసిన ఈ చిత్ర దర్శకుడు వెంకటేష్ మహా ఆ తర్వాత సినిమాల మీద ఆసక్తితో ఆ రంగాన్ని వదిలి కొన్ని టీవీ కార్యక్రమాలకు పనిచేశారు. విజయవాడ వాసి అయినా కంచరపాలెంతో తనకు అనుబంధం ఉండడంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఓ చిత్రం తీయాలని భావించారు. ఆ క్రమంలో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఓ ఎన్నారై ముందుకు రావడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ సినిమాలో దాదాపు 50 మంది స్థానికులే నటించడం విశేషం. చిత్రాన్ని తనకున్న వనరులతో మంచి క్వాలిటీతో తీయడంతో సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేయడానికి ముందుకొచ్చింది. రానా దగ్గుబాటి ఈ చిత్ర ప్రచార బాధ్యతలనూ స్వీకరించారు. న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో చోటు దక్కించుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ది హిందూ పత్రికలో ఈ చిత్రం గురించి చెబుతూ "స్మాల్ ఫిల్మ్ విత్ ఏ లార్జ్ హార్ట్" అని కీర్తించడం జరిగింది.[4]